Friday, November 14, 2008

india win 1st one day match of india vs england

                                  ఇంగ్లాండుపై శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండుపై భారత్ 158 పరుగుల భారీ ఆధిక్యతతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ చతికిలపడ్డారు. పీటర్సన్, బొపారా మాత్రమే కాస్తా రాణించారు. పీటర్సన్ 63 పరుగులు చేయగా, బొపారా 54 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇన్నింగ్సు ప్రారంభంలోనే జహీర్ ఖాన్ ఇంగ్లాండు వెన్ను విరిచాడు. జహీర్ 3 వికెట్లు తీసుకున్నాడు. మునాఫ్ పటేల్, ఆర్పీ సింగ్, సెహ్వాగ్, యూసుఫ్ పటేల్, హర్భజన్ సింగ్ లకు ఒక్కటేసి వికెట్లు లభించాయి. ఆస్ట్రేలియా 229 పరుగులు మాత్రమే పరుగులు మాత్రమే చేయగలిగింది.

యువరాజ్ సింగ్ చెలరేగి ఆడడంతో రాజ్‌కోట్‌లోని మాధవరాజ్ సింథ్యా మైదానంలో పరుగుల వరద పారింది. కేవలం 78 బంతుల్లో 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యువరాజ్ భారత్ భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది. వన్డేలో భారత్ కు ఇది అత్యధిక స్కోర్. యువరాజ్‌కు తోడు ఓపెనర్లు సెహ్వాగ్ (85), గంభీర్ (51)లు సైతం ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ధోనీ (39), రైనా (43)లు సైతం ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపారు. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లలో హార్మిసన్, పటేల్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా ఫ్లింటాఫ్ ఒక వికెట్ తీశాడు.

ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్‌లు శుభారంభానిచ్చారు. ధాటిగా ఆడిన ఈ జంట తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించింది. ఈ దశలో పటేల్ బౌలింగ్‌లో షా పట్టిన క్యాచ్‌తో అర్థ సెంచరీ చేసిన గంభీర్ (51) పెవిలియన్ బాట పట్టాడు. అటుపై క్రీజులోకి వచ్చిన రైనాతో కలిసి సెహ్వాగ్ తన ధాటిని కొనసాగించాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‍‌కు 26 పరుగులు జోడించారు. ఈ దశలో అర్ధ సెంచరీ పూర్తి చేసి మంచి ఊపు మీదున్న సెహ్వాగ్‌ (85)ను పటేల్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ ప్రారంభం నుంచి తన ధాటిని కొనసాగించాడు. వెన్ను నొప్పి కారణంగా నడుముకు బెల్ట్ కట్టుకుని క్రీజులోకి వచ్చిన యువరాజ్ ఇంగ్లాండ్ బౌలర్ల భరతం పట్టాడు. అయితే అర్థ సెంచరీకి దగ్గరవుతున్న దశలో రైనా (43) ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా క్రీజు నుంచి నిష్ర్కమించాడు. అటుపై క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోనీ (39) సైతం హర్మిసన్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. చివరగా యువరాజ్‌తో కలిసి రోహిత్ శర్మ (11) నాటౌట్‌గా నిలిచాడు.

No comments: